చంటిబిడ్డ కెవ్వుమంటే చాలు, కన్నపేగు కదిలిపోతుంది. చిన్నారి కేరుమంటే చాలు, తల్లిమనసు తుళ్లిపడుతుంది. ఎక్కడున్నా ఒక్క క్షణంలో బిడ్డముందు వాలి అక్కున జేర్చుకుంటుంది. అలాంటి అమ్మే తన బిడ్డను కాదనుకుని చేతులారా మరో చేతికి అందించిందంటే? అందుకు కారణం ఆ కన్నతల్లి కర్కశురాలా, కారుణ్యం లేనిదా, కాఠిన్యురాలా? బిడ్డ చిరునవ్వు చూసి లోకాన్ని మరచిపోయే తల్లుల్ని చూశాం. పసికందుకోసం కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదురీదే అమ్మల్ని చూశాం. అమ్మతనపు కమ్మదనం సాక్షిగా, మమతల మాధుర్యం తోడుగా ప్రపంచాన్ని ఎదుర్కొనే కడుపుతీపిని చూశాం. కానీ మంచాల మండలంలోని తల్లులు తమ ప్రేమాప్యాయతలకన్నా, ముద్దుమురిపాలకన్నా బిడ్డ కడుపు నిండటమే ముఖ్యమనుకున్నారు. తమవద్ద ఉండి పస్తులుండేకన్నా ఎక్కడున్నా తమ బిడ్డలు సుఖంగా ఉంటే చాలనుకునే నిస్సహాయస్థితిలో వారున్నారు. పిల్లల భవితవ్యంకోసం గత్యంతరంలేక అనురాగాన్ని గుండెలోతుల్లో అదుముకున్న మాతృమూర్తులు వారు! పేదరికంముందు ఓడిపోయిన పేగుబంధపు దీనగాథలు వారివి.
ప్రతాప్
No comments:
Post a Comment